పే...ద్ద దోశ!!

సంక్రాంతి పండుగకని ఇంటికి వెళ్ళాను. ఇంటి బయట ఆటో దిగగానే సీరియస్ గా  ఓ లుక్ ఇచ్చింది అమ్మ. చెన్నై నుంచి మల్లీ ఇంటికి రావడానికి రెండు నెలలు పట్టింది. అందుకే అమ్మ చాలా కోపం గా ఉంది . అదేంటో, అమ్మ కోపం లో బోలెడంత ప్రేమ కూడా ఉంటుంది. అందుకే, నేను ఫ్రెష్ అయ్యే లోపు బ్రూ కాఫీ రెడీ గా ఉంది. అమ్మ కోపం లాగె కాఫీ కూడా చాలా వేడి గా ఉంది.  కాఫీ తాగేంత సేపు లేదు, అమ్మ కోపం. భుజం మీద గాట్టిగా ఒక్కటిచ్చి, "ఇంకో వారం చూసి, మేమె వచ్చేవాళ్ళం చెన్నై కి" అని నవ్వేసింది.

ఉదయాన్నే చల్లటి నీటి తో మొహం కడుక్కొని, పొగలు కక్కుతున్న కాఫీ తాగడం లో ఉన్న సంతృప్తి ఇంకేదాంట్లో దొరకదేమో. అదీ అమ్మ చేతి కాఫీ.. <3. చిక్కటి కాఫీ గొంతులో వెళ్తుంటే...గుటక గుటక కి కళ్ళు మూసుకొని... వేడి పొగ ను ఆస్వాదిస్తూ... ఆ తియ్యదనం నోటి లో ఇంకిపోతుంటే ...దీని కోసమే ప్రతి రోజు పని వదిలేసి ఇంటికి వచ్చేయచ్చు. కొన్ని కొన్ని ఫీలింగ్స్ ని పోల్చడానికి ఏ గొప్ప విషయం సరిపోదు. వాటికవే సాటి.

నాన్న బయట 'ఈనాడు' చదువుతూ ఉన్నాడు. అమ్మ టిఫిన్ ఏర్పాట్లు మొదలుపెట్టింది. నేను టీవీ చూడ్డం మొదలుపెట్టా. ఏవో సినిమా పాటలు వస్తున్నాయ్. చిన్నప్పుడు, ప్రతి ఆదివారం ఈటీవీ లో వచ్చే రామాయణం, పంచతంత్రం కోసం వారమంతా వేచివుండే వాళ్ళం. అలా వేచిఉండటం అస్సలు బోర్ కొట్టేది కాదు. చూసిన తర్వాత రెండు రోజులు స్కూల్ లో వాటి గురించే చర్చ. చర్చ అనడం కన్నా గోల అనడం కరెక్ట్ ఏమో. అందుకే మాస్టారు అప్పుడప్పుడు క్లాస్రూమ్ లోకి వచ్చి "ఆపండ్రా మీ గోల" అనేవాడు. 'ఏది ఏది ..కుదురేది ఏది .. యెదలో... ' టీవీ లో మంచి పాట వచ్చేసరికి స్కూల్ నుంచి వచ్చి ఇంట్లో పడ్డాను. 

"నాన్నా... దోశ లోకి ఛనక్కాయల చట్నీ చేయనా, పప్పుల చట్నీ చేయనా... " అమ్మ వంటింట్లోంచి అడిగింది.  "ఛనక్కాయలు మా..." టీవీ చూస్తూనే చెప్పాను. ఎన్ని రోజులైంది దోశ లోకి ఆ చట్నీ తిని.. అస్సలు మంచి దోశలు తిని ఎన్ని రోజులైందో. ఇలాంటీ విషయాలు గుర్తొచ్చినప్పుడే... జాబ్ మానేసి ఇంటికి వచ్చేయాలనిపిస్తుంది. అమ్మ వంట లో ఉన్న ఆప్యాయత, దానికున్న ఆకర్షణ అలాంటివి మరి. 



సరే ఈ రోజు ఆదివారం కదా... ఈనాడు పేపర్ తో వచ్చే సండే మ్యాగజైన్ తీసుకుని నాన్న పక్కనే కూర్చున్న. ఇప్పుడైతే నా తమ్ముడు ఇంటికి రాలేదు కానీ, వాడు వచ్చి ఉంటె మాత్రం, సండే బుక్ కోసం పెద్ద గొడవ జరిగిపోయేది. పేపర్ రాగానే బుక్ ఫస్ట్ చదవడం కోసం పోటీ పడేవాళ్ళం. ఈ పోటీ మన క్లాసు పుస్తకాలు చదవడంలో అస్సలు ఉండేది కాదు. క్లాసు పుస్తకాలకు, మాకు మధ్య బలమైన వికర్షణ శక్తి ఉండేది. అది భూమి గురుత్వాకర్షణ శక్తి కంటే బలమైనది అనుకుంటా, అందుకే మా చుట్టుపక్కల పుస్తకాలు ఉండేవి కాదు. అప్పుడప్పుడు నాన్న పుస్తకాల బ్యాగ్ తెచ్చి పక్కన పెట్టె వాడు, "చదువుకొండ్రా..." అని.  అప్పుడు మేము వాటి చుట్టుపక్కల ఉండే వాళ్ళం కాదు. ఇలా ఆలోచిస్తూ... కార్టూన్లు, సిల్లిపోయింట్, కవర్ స్టోరీ, సెంటర్ పేజీ, కథ.. చదివేసా.. ఇంక మిగిలింది, పదవినోదం. ఇది మాత్రం నేను, తమ్ముడు కలిసే చేసేవాళ్ళం.
తమ్ముడు: "3 నిలువు, కరము... రెండు అక్షరాలు... ఏంట్రా... హస్తం కదా...".
నేను: "అవును రా... కరెక్టే "
త: "మరి 11 అడ్డం తో సరిపోవట్లేదు.. చివరి అక్షరం 'డం' ఉండాలి"
నేను: "అవునా.. ఆగు .. ఏం గుర్తురావట్లేదు."
నాన్న: 'తొండం' సరిపోతుందేమో చూడు
త: సరిపోయింది నాన్న.
ఇలాంటివి ఎన్నో... మేము ఆగిపోయిన ప్రతిసారి నాన్న హెల్ప్ చేసేవాడు. మొత్తానికి ఆ రోజు అది పూర్తి చేసే దాక నిద్ర పట్టేది కాదు.

"టిఫిన్ రెడీ అయ్యిందండి.." అమ్మ పిలుపు . సరే అని నాన్న, నేను లోపలికి వెళ్ళాం. అమ్మ అన్నీ నేల మీద అమరుస్తోంది. ఇంట్లో ఇప్పటికీ నేల మీద కూర్చుని తింటాం. మా ఇద్దరి పళ్ళాల్లో చెరొక దోశ వేసి, ఇంకో దోశ పెనం మీద వేయడానికి వెళ్ళింది అమ్మ. దోశని చిన్న చిన్న ముక్కలు చేసుకొని చట్నీ లో అద్దుకొని తింటున్న.. సగం దోశకె పళ్లెం లో చట్నీ ఐపోయింది. చట్నీ అంత రుచిగా ఉంది మరి.
"దోశ లోకి చట్నీ తినురా.. చట్నీ లోకి దోశ తినకు" అన్నాడు నాన్న. అమ్మ నవ్వుతూనే ఇంకో దోశ తెచ్చింది.
"మా.. ఇంకో దోశ చాలు నాకు" చెప్పాను .. చట్నీ తింటూనే .
"మూడు దోశలు ఏం సరిపోతాయి నాన్నా... ఇంకో రెండు వేసుకొస్తా...సరేనా...  "
"వద్దు మా... ఇపుడే కడుపు నిండి పోయింది. "
"కూర్చొని మెల్లగా తిను రా ... ఇంక రెండే గా... "
"ప్లీజ్ మా... మల్లి మధ్యాన్నం అన్నం తినను చెప్తున్నా... "
"సరే" అని నాకు వేద్దాం అని తెచ్చిన దోశ ని నాన్నకు వేసేసింది. నాకు అర్థం కాలేదు. నాన్న ప్లేట్ లో ఇంకా దోశ అలానే ఉంది. నేను ఖాళీ పళ్లెం తో కూచున్నా కూడా, నాన్నకే వేసి, "అది చల్లారి పోయింది రా.. నీకు వేడిగా వేసుకొస్తా ఉండు" అని చెప్పింది. ఇంకో రెండు నిముషాల తర్వాత వేడి వేడి దోశ తీసుకొచ్చి నా ప్లేట్ లో పెట్టింది. అప్పుడర్థమైంది నాకు. మమ్మీ మాస్టర్ ప్లాన్. తెచ్చింది ఒక దోశే అయినా రెండు దోశలకు అయ్యేంత పిండి తో, పే...ద్ధ గా వేస్కొచ్చింది. ఇంకేం చేస్తాం ... తెచ్చింది ఒక దోశే గా... తినక తప్పలేదు.


--- శ్రీ ---

Comments

Post a Comment

Popular posts from this blog

ఏ మాయ చేసావే.. !?

(సరదా కి) Guide to youngsters whose parents have smartphones

పొట్టి బుడంకాయ్!