ఏ కాలేజీలో నైనా క్లాసులు ఇలాగే జరుగుతాయేమో......(ఊర్కే ....తమాషా కి...... )

ఇది నేను b.tech లో జాయిన్ అయిన మొదటి సంవత్సరం లో జరిగిన సంగతి . కాలేజీ లో జాయిన్ అయిన రెండో రోజే క్లాసులు మొదలుపెట్టారు . మాకు  కంప్యూటర్ కి సంబంధించి ఒక సబ్జెక్టు ఉండేది(సబ్జెక్టు పేరు ఎందుకులెండి ) . దాన్ని చెప్పడానికి ఓ మహామహుడు(ఈయన పేరు కూడా ఎందుకులెండి )  ప్రొఫెసర్ గా వచ్చేవాడు . అయన క్లాసే  మా మొదటి క్లాసు, అదెలా జరిగిందో వినండి ,

సర్ లోపలికి రాగానే అందరు నిల్చున్నాం . ఆయన అందరివైపు ఓ లుక్కిచ్చేడు . అందర్నీ చూడ్డానికి పెద్ద సమయం పట్టలేదులెండి . నలభై మంది క్లాసులో నలుగురం వచ్చాం . అదేంటో, చిన్నపట్నుంచి మొదటి క్లాసు కు వెళ్ళే అలవాటే లేదు మాకు.మొదటి క్లాసు కదా  , ఏమీ చెప్పరులే అని మేమే డిసైడ్ అయిపోయేవాళ్ళం . సరే క్లాసులు మొదలైన మొదటి రోజే డుమ్మా కొడితే బావోదని నేను వెళ్ళాను. మిగతా వాళ్లకి అలాంటి పట్టింపులు ఏమిలేవనుకుంట ,లేకపొతే  మొదటి క్లాసు ఎక్కడైనా మొదటి క్లాసే అని రాలేదేమో.
సరే క్లాసు మొదలుపెట్టాడు. ఏమి చెప్పకుండా డైరెక్టుగా బోర్డు దగ్గరికి వెళ్ళిపోయి ఎదో గీస్తున్నాడు. తీరా చూస్తే అదే బొమ్మ . ఎప్పుడో ఎనిమిదో తరగతి లో కంప్యూటర్ సబ్జెక్టు మొదటి క్లాసు లో మా కంప్యూటర్ మాస్టారు గీసిన బొమ్మ . సైజులు , షేపులు కూడా మారలేదు. క్లాసు లో మిగతా ముగ్గురుని చూసా . వారి లో కూడా అదే ఫీలింగ్.
సర్ బొమ్మ గీసిన తర్వాత మా వైపు తిరిగాడు. చూసారా ఎలా గీశానో అన్నట్టు గర్వంగా ఓ చూపు విసిరాడు . "మీకు కంప్యూటర్ అంటే ఏంటో  తెలుసా .... ? " అని అడిగాడు నన్ను చూస్తూ. ముందే ఇంజనీరింగ్ అంటే అదని ... ఇదని...ఊర్లో నా  ఫ్రెండ్స్ చెప్పారు. అక్కడ పోఫెసర్స్ ఛా...........లా..........స్ట్రిక్ట్  అని, మాలాగా కాదని మా ఇంటర్మీడియట్ లెక్చరర్స్ ఓ .. భయపెట్టేసారు. అందుకే ... సర్ అడిగిన ప్రశ్న కి చెప్పగలిగేంత తెలిసినా , చెప్పకుండా , అదేదో మీరే సెలవియ్యండి అన్నట్టు చూసాను.ఇంతలో సారు గారి సెల్లు మోగింది .మాట్లాడ్డానికి  బయటికి వెళ్ళాడు . లోపల మా సొల్లు మొదలైంది. ఒకడు కంప్యూటర్ అంటే  ఏంట్రా అని ఇంకోడ్ని అడ్గుతున్నాడు . మిగిలినోడు ,సారు వాడ్ని అడిగితె ఏం చెప్పాలో రిహార్సల్స్ చేస్కుంటున్నాడు. ఉన్నది నలుగురేగా , ఎంత పెద్ద గా మాట్లాడిన పెద్ద శబ్దమేమి రావట్లేదు . అదే నలభై మంది ఉండుంటే గుసగుసలాడిన, గులకరాళ్ళు ఢంకా మీద పడ్డట్టు శబ్దమోచ్చేది .ఇంతలో సారు లోపలికి వచ్చాడు . మిగిలిన ముగ్గరూ సారు అడిగిన ప్రశ్నకి నేను చెప్తా అంటే నేను చెప్తా అన్నట్టు కన్నులతోనే పోటి పడుతున్నారు. నేను మాత్రం ఎందుకొచ్చిన తంటా అనుకొని నా పుస్తకం లోకి చూస్కుంటున్నాను . క్లాసు లో ప్రశ్న అడుగుతున్నప్పుడు ఎవరు సారు వైపు చూస్తె వాళ్లనే అడుగుతాడనే నమ్మకం నాకు బలంగా ఉండేది.అందుకే.
కాని ఆయన వాళ్ళని నిరాశపరిచాడు . అలా అని నన్ను అడగలేదులెండి . " మిగిలిన కాన్సెప్ట్స్ నెక్స్ట్ క్లాసు లో చెప్పుకుందాం . అందరు బాగా ప్రిపేర్ అయ్యిరండి. నాక్కొంచెం పనుంది. " అని వెళ్ళిపోయాడు.అదేదో ఈరోజు గంటల కొద్దీ చెప్పుకున్నట్టుసరిగ్గా పావుగంట కూడా జరగలేదు . నేను బ్రతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకున్నా . వాళ్ళు మాత్రం నీరుగారిపోయారు . ఒకడైతే, నేను ఇలా చెప్పాలనుకున్నా ....అని మొత్తం ఏకరవు పెట్టాడు ఇంకోడితో . వాడు దానికి, " నేను కూడా సేమ్ అదే చెప్పాలనుకున్నా తెలుసా.." అన్నాడు. మిగిలిన ఒకడు మాత్రం నెక్స్ట్ క్లాసు కి ప్రిపేర్ అవుతున్నాడు అప్పుడే .....


Comments

  1. దాదాపు ఇంజినీరింగ్ కాలేజిల్లో ఇలానే ఉంటుంది పరిస్థితి. బాగా వ్రాసారు.

    ReplyDelete
    Replies
    1. very very thanks for your response, chinni garu.

      Delete

Post a Comment

Popular posts from this blog

ఏ మాయ చేసావే.. !?

సీతాకోకచిలుక

(సరదా కి) Guide to youngsters whose parents have smartphones