మౌనం

    ఈ ప్రపంచం లో నాకు బాగా ఇష్టమైన అమ్మాయి ముందు నేనెందుకు మూగవాడి లాగా అయిపోతానో, ఎందుకు నా గుండె సెకను కి వెయ్యి సార్లు కొట్టుకుంటుందో ...ఎందుకు నా గుండె చప్పుడు మృదుమనోహరం గా నాకే వినిపిస్తుందో, ఎందుకు నా శ్వాస లో ప్రతి కదలిక ప్రస్పుటం గా తెలుస్తోందో.. ఏమో..

     ఆ అమ్మాయి మాటలు వినగానే.. కాదు కాదు, ఆ అమ్మాయి చూడగానే, అహ్హ్.. అంతెందుకు , ఆ అమ్మాయి ని తలుచుకోగానే , ఎందుకు నాకు మాటలు వచ్చన్నసంగతే మర్చిపోతాను. నోరు నవ్వడానికి తప్ప ఎందుకు ఇంకెందుకు పనికి రావట్లేదు. అదేదో తెలీని నొప్పి ఒకటి గుండెల్లో మొదలై, నా మనసు ని తన కంట్రోల్ లోకి తీసుకుంటుంది. ఆ తర్వాత నేనేం మాట్లాడ్తున్నానో, ఏం చేస్తున్నానో నాకే తెలీదు.

  ఆ అమ్మాయి నాకు దగ్గరలో ఉన్నంత వరకు నాలో ఒక రకమయిన వణుకు పుడుతుంది.ఆ అమ్మాయి తో మాట్లాడిన ఇన్ని క్షణాలలో నేనేం మాట్లాడానో కొంచమయిన జ్ఞాపకం రాదే. ఆ నవ్వు లో ఏముందో కానీ, నాకు మాత్రం, ఇళయరాజా సంగీతం వింటున్నంత ఆనందం గా , రఫీ పాటంత మధురం గా ఉంటుంది.

  ఆ అమ్మాయి తో గడిపిన ప్రతి క్షణం, ఆ అమ్మాయి గురించి తెలిసిన ప్రతి విషయం, తనకి నన్ను మరింత దగ్గర చేసాయి. నన్ను నాకు పరిచయం చేసాయి. ఇన్ని అస్తవ్యస్తమయిన భావాలు నా మనసులో కలుగుతాయని నాకే తెలీలేదు, తనని కలిసే దాక. కానీ తనకు నేను, నా ప్రేమ సరితూగవేమో అని అన్పించినప్పుడు మాత్రం గుండెల్లో ఏదో నొప్పి.

( ఒక స్నేహితుడి ప్రేమ, ఆరాధన. నా అక్షరాల్లో....)




Comments

Popular posts from this blog

పే...ద్ద దోశ!!

ఏ మాయ చేసావే.. !?

వానర్ బాబా - ఓ కోతి కథ!