మనసును తాకిన కాగితం!


వేసవి కాలం. సూర్యుడి తాపం తగ్గి ఇప్పుడిప్పుడే కాస్త సాయంత్రపు గాలులు పలకరించడం మొదలుపెట్టాయ్. రోజూ ఆఫీసు నుండి అలసిపోయి వచ్చే నేను, ఆదివారం కావడం తో పని లేక అలసిపోయాను. ఒళ్ళంతా బద్ధకం గా ఉంది. చేసేదేం లేక వెళ్లి ఒక గంట సేపు చల్లటి షవర్ స్నానం చేసి, జుట్టు తుడుచుకునే ఓపిక లేక కొప్పు కట్టుకున్నాను. AC ఆన్ చేసి కిటికీలు క్లోజ్ చేసి నా స్టడీ చైర్ లో కూర్చున్న. మృదువు గా నా ముఖాన్ని తాకుతున్న చల్లటి AC గాలి నా మనసులో ఇంకా నిద్రపోతున్న తాజాదనాన్ని మధురం గా తట్టి లేపుతోంది.

ది ఫౌంటెన్ హెడ్ బై ఆయన్ రాండ్. ఎప్పుడో సంవత్సరం క్రితం బుక్ ఫెయిర్ లో కొన్నట్టు గుర్తు. బుక్స్ కొనడం లో తప్ప చదవడం లో లేని నా ఇంట్రెస్ట్ ని, ఓపెన్ చేసిన ప్రతిసారి, రెండు పేజిలు చదివి అటకెక్కే నా ఓపిక ని వెక్కిరిస్తూ షెల్ఫ్ లో కనబడిందా పుస్తకం. ఎలాగైనా ఈరోజు ఒక పది ఇరవై పేజీలు దాటాలని గట్టిగా అనుకుని పుస్తకాన్ని ఓపెన్ చేశాను.

అస్తమిస్తున్న సూర్యుడి కాంతి, ఎదురుగా ఉన్న కొత్త గా కట్టిన అపార్ట్ మెంట్స్ గాజు కిటికీల మీద పడి, దాని రిఫ్లెక్సన్ నా రూమ్ కిటికీ అద్దం లోంచి నా రూమ్ లోకి దూరి, రూమ్ మొత్తం ఎర్రటి కాంతి తో నిండిపోయింది. కిటికీ పక్కనే కూర్చున్న నేను, ఈ నునువెచ్చని కాంతి ని.. AC నుంచి వస్తున్న చల్లటి గాలిని ఆస్వాదిస్తూ.. బయటికి చూస్తూ ఉంటె, దబ్.. అని ఏదో కిటికీ అద్దానికి  తగిలి మా బాల్కనీ లో పడింది. అదేంటో చూద్దాం అని వెలితే, ఒక మూలన పడున్నకాగితం ముద్ద కనిపించింది. ఓపెన్ చేస్తే ఎదో లెటర్ లా ఉంది.

హాయ్..
నేను ఇందాకటి నుంచి మిమ్మల్నే చూస్తూ ఉన్నా. ఈవెనింగ్ ని ఎంజాయ్ చేస్తూ ఏదో బుక్ చదువుతున్నట్టు ఉన్నారు.. డిస్టర్బ్ చేసినందుకు సారీ. ఎందుకో మిమ్మల్ని చూడగానే, మీతో మాట్లడాలి అనిపించింది. ఆ ఫీలింగ్ ని ఇగ్నోర్ చేసి నా పని లో నేను ఉంటె, ఆ ఫీలింగ్ కొంచెం కొంచెం పెరిగి మైండ్ మొత్తం అదే థాట్ తో నిండి పోయింది. తన తో మాట్లాడు..మాట్లాడు అని. అందుకనే మిమ్మల్ని పిలుస్తూ సైగ చేస్తూ ఉన్న..కాని మీరు ఇటు వైపు తిరిగితే ఒట్టు..

చదవడం ఆపి, ఆ లెటర్ ఎవరు విసిరారో అని చూసా. ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ లో ఒక అబ్బాయి హాయ్ చెప్తూ కనబడ్డాడు. చూడ్డానికి పద్ధతి గా నే ఉన్నాడు... కాదు కాదు.. చాలా బాగున్నాడు. ఎదో ఆకర్షణ ఉంది ఆ అబ్బాయి లో.. తిరిగి లెటర్ చదవడం మొదలుపెట్టాను.

సారీ.. పరిచయం లేకపోయినా ఏదేదో చెప్తున్నాను. అన్నట్టు మేము కొత్తగా ఈ అపార్ట్ మెంట్ లో కి వచ్చాం. సో నేను మీకు పొరిగింటి అబ్బాయి ని. ఇలా లెటర్ రాస్తున్నందుకు, నేను కనిపించిన అమ్మాయిల వెంటపడే రోమియో అనుకోకండి. లేదా ఇంకేదో అని అంతకంటే అనుకోకండి. ఒక సాధారణ అబ్బాయిని. మీతో మాట్లాడాలి అనే ఫీలింగ్ ని అనిచివేయలేక ఓడిపోయిన అబ్బాయిని.

ఈ అబ్బాయి మాటల్లో ఎదో మాయ.. కళ్ళలో తెలీని కాంతి.. మొదటి చూపు లోనే పరిచయం అయిపోయిన భావన. నాక్కూడా తనతో మాట్లాడాలి అనే ఫీలింగ్.. ఒక పాజిటివ్ ఇంప్రెషన్.

ఇలా అడుగుతున్నందుకు తప్పుగా అనుకోకండి. ఎందుకో మీరు నాకు ముందే తెలుసు అన్నట్టు గా ఉంది. మీతో ఇప్పుడు మాట్లాడకపోతే నా మనసు అలిగి నా మాట వినదేమో అనిపిస్తోంది. మీకు సమ్మతం అయితే మన బిల్డింగ్ పక్కనే ఉన్న కాఫీ హౌస్ లో కలుద్దాం.

- మీ పొరిగింటి అబ్బాయి.

రేఖా.. కాఫీ తాగుతావా? అని అమ్మ పిలవడం తో నా ఊహల్లోంచి బయటి ప్రపంచం లోకి వచ్చాను. ఒక సంవత్సరం... వేసవి మొదలైనట్టుంది మళ్ళీ. ఎదురుగా కిటికీ లో, దాదాపు సంవత్సరం క్రితం ఫైర్ ఆక్సిడెంట్ లో కాలిపోయిన బిల్డింగ్ ఆనవాళ్ళు. రెనోవేషన్ వర్క్ జరుగుతున్నట్టు ఉంది. పాత బిల్డింగ్ కి కొత్త అద్దాలు. అద్ధాల మీద అస్తమిస్తున్న సూర్యుడి ప్రతిబింబం. మనుషులు మనకు దూరం అవ్వచ్చు. కాని జ్ఞాపకాలు.. మనసులో పదిలం. ది ఫౌంటెన్ హెడ్ బై ఆయన్ రాండ్... పుస్తకం పేజీల మధ్యలో - ఆ పుస్తకానికి సంబంధం లేని మరో కాగితం.. నా పక్కనే ఉన్న కిటికీ అద్దానికి తగిలిన కాగితం.. నా మనసును తాకిన కాగితం.. భద్రం గా!

-శ్రీ 

Comments

Popular posts from this blog

ఏ మాయ చేసావే.. !?

సీతాకోకచిలుక

(సరదా కి) Guide to youngsters whose parents have smartphones