ఒరేయ్ సుబ్బారావ్!!...

నాకు సుబ్బారావ్ మీద పీకల్దాకా, ఇంకా చెప్పాలంటే నడినెత్తి దాకా కోపం వచ్చింది. అసలు అలా ఎలా అనగలిగాడు వాడు? అని నా బుర్ర అరిగేదాకా ఆలోచించినా అర్థం కాలేదు. ఏంటో వాడు మాట అన్నప్పటి నుండి నా మనసు మనసులో లేదు. అయినా మనిషంత మనిషిని నన్ను ఎదురుగా పెట్టుకొని అంత మాట అనడానికి మనిషికి అంత ధైర్యమేమిటో? బహుశా అతనికి క్రితం రోజు తగిలిన లక్ష రూపాయల లాటరీ ప్రభావమేమో! కాదు కాదు అది ఖచ్చితంగా అంతకుముందు పక్కవీధి మందులకొట్టులో(అంటే 'మెడికల్ షాప్' కాదుమందు కొట్టేకొట్టు) కొట్టిన వంద రూపాయల ప్రాంతీయ సరుకు ఇచ్చిన బలమేనని నా గఠ్ఠి నమ్మకం. లేకపోతే అంత తెగువ అతనికెక్కడిది?. అసలు నాకొచ్చిన కోపానికి అతణ్ణి అక్కడే తన్నేవాన్ని, కానీ నా స్నేహితుడు అడ్డుపడటంతో బ్రతికిపోయాడు.

ఇంటికి వచ్చాక కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నా కూడా నన్నెవరూ ఏమైందని అడగలేదు. దాంతో నా కోపం రెట్టింపయింది. కానీ వెంటనే 'ఇంట్లో ఎవరూ లేకపోతే ఎలా అడగగలరుఅన్న మహత్తర విషయాన్ని కనుగొన్నాను. ఇంత గొప్ప సంగతి కనుక్కునందుకు నాకేమైనా నోబెల్ బహుమతి ఇస్తారేమోనని నా స్నేహితుణ్ణి అడిగాను ఫోన్లో. కానీ వాడు ' సంవత్సరం నోబెల్ బహుమతులు ప్రటించేశారు, నువ్వు వచ్చే సంవత్సరం ప్రయత్నించమన్నాడు. ఫోన్ పెట్టేసాక సుబ్బారావ్ గుర్తొచ్చాడు. 'ఒరేయ్ సుబ్బారావ్! నీ రక్తం కళ్లజూస్తాను ఇవాళ. నువ్ అయిపోయావ్ రా!. నా చేతిలో చావు దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉండుఅని ఆవేశంగా స్టోర్ రూంకి వెళ్లి, అక్కడున్న తుప్పు పట్టిన తుపాకీని తీసుకుని 'ఓరేయ్! రేప్పొద్దునకల్లా నీ ప్రాణాలు గాల్లో కలిసిపోకపోతే నా పేరు.. నా పేరు ...’ అంటూ ఆవేశంతో ఎగురుతున్న నేను, వెనకాల ఉన్న బల్లని చూసుకోకుండా గుద్దేసి అంత దూరం ఎగిరి పడ్డాను. మోకాలుకి గట్టి దెబ్బ తగిలి, రక్తం కూడా వస్తోంది. రక్తం చూసేసరికి నాకు స్పృహ తప్పుతున్నట్టు అనిపించింది. పక్కింటి పాపారావుగారు హాస్పిటలుకి తీసుకెళ్లినంతవరకు గుర్తుంది.

కళ్లు తెరిచేసరికి నా మోకాలుకి పెద్ద బ్యాండేజి చుట్టుంది. ఎదురుగా మా ఆవిడ ఉంది. ‘నిన్న వెళ్లి అప్పుడే వచ్చేశావా ఊర్నించి?' అనడిగా. ‘అపుడే ఏంటి? నే వెళ్లి పది రోజులైందిఅంది తను. నాకు కళ్లు తిరిగినట్లయింది. వాడెవడో 'వార్డు బోయ్' అట, కాఫీ తెచ్చిచ్చాడు. ఇంతలోకే నా స్నేహితుడొచ్చి 'ఏరా ఎలా ఉంది?’ అని అడిగాడు. నేను 'కొంచెం షుగర్ తక్కువైందిరా' అన్నాను కాఫీని ఉద్దేశించి. దానికి వాడు 'ఒరేయ్! నేను అడిగింది నీ దిక్కుమాలిన కాఫీని గురించి కాదురా నీకెలా ఉందని. అయినా నువ్విలా ఉన్నావ్ కాబట్టే వాడలా రెచ్చిపోయాడుఅన్నాడు. వెంటనే నాకు సుబ్బారావ్ గుర్తొచ్చాడు. నా కోపం కట్టలు తెంచుకుంది. నరాలు బిగుసుకున్నాయి. కోపంలో పక్క బెడ్డు పేషంటుకున్న సెలైన్ బాటిల్ లాగేశాను. వాళ్లావిడ నా చెంప ఛెళ్లుమనిపించింది. నా కోపం ఇంకా పెరిగింది. కానీ ఈసారి కోపం సుబ్బారావ్ మీద కాదు, నా మీదే. ఎందుకంటే సుబ్బారావ్ ఆరోజు నన్నేమన్నాడో జ్ఞాపకం రావటంలేదు. తరువాత, నా ఆవేశాన్ని చూసి భయపడో లేక నేనుండటం వల్ల బెడ్డు వేస్టు అనుకున్నారోగానీ హాస్పిటలు వాళ్లు నన్నక్కడనుండి తరిమేశారు.

ఇంటికి వచ్చాక 'అయినా సినిమాల్లో తలకి దెబ్బ తగిలితే కదా గతం మర్చిపోతారు? మరి నేనేంటి మోకాలికి తగిలితే మర్చిపోయాను?' అని ఎంత తీవ్రంగా ఆలోచించినా తట్టలేదు నాకు. అలాగే, టి.వి సీరియల్సు చూడటం వల్ల కూడా అప్పుడప్పుడు నాకు మోకాలు నొప్పి వచ్చేదన్న విషయం అప్పుడే గుర్తొచ్చింది. ఇవన్నీ ఆలోచిస్తుంటే మళ్లీ మోకాలు నొప్పి ఎక్కువవుతుందేమోనని, కళ్లు మూసుకుని నిద్రపోయాను. 
(
నిద్రలో నేనుఒరేయ్ సుబ్బారావ్ నువ్వేమన్నావో చెప్పరా ప్లీజ్!’ అని కలవరిస్తున్నానని పొద్దున మా ఆవిడ చెప్పేదాకా తెలీలేదు నాకు )

-
బాలు


Comments

Post a Comment

Popular posts from this blog

ఏ మాయ చేసావే.. !?

పొట్టి బుడంకాయ్!

సీతాకోకచిలుక