నాకు మాత్రం ఉండదా!!

నా పాటికి నేను గుర్రుపెట్టి నిద్రపోతుంటానా, మెత్తగా బుగ్గ మీద మీటి తెల్లారింది లే అంటావ్, నాకు మాత్రం ఉండదా, ఈ అందమైన ఉదయం నీతో గడపాలని.
నా పాటికి నేను బాల్కనీ లో కాఫీ తాగుతూ ఉంటానా, మెల్లగా వచ్చి ఒల్లో కూర్చొని సరసాలు ఆడుతావ్. నాకు మాత్రం ఉండదా, ప్రేమ గా నీతో ఆడుకోవాలని.
నా పాటికి నేను లీనమై పేపర్ చదువుతుంటానా, టిఫిన్ పట్టుకొచ్చి ప్రేమగా తినరాదూ అంటావ్. నాకు మాత్రం ఉండదా, నీ చేతి వంట కడుపార తినాలని.
నా పాటికి నేను ఆఫీసుకి పోతూ ఉంటానా, అడ్డొచ్చి అమాయకం నిండిన చూపుల్తో ఆగిపోరాదూ అంటావ్. నాకు మాత్రం ఉండదా, రోజంతా నీతో గడపాలని.
నా పాటికి నేను ఎదో పని చేసుకుంటుంటానా, కాల్ చేసి మధురం గా ఏం చేస్తున్నారండి అంటావ్. నాకు మాత్రం ఉండదా, నీతో గంటలకొద్ది మాట్లాడాలని.
నా పాటికి నేను కొలీగ్స్ తో మాటల్లో మునిగిపోయుంటే, లంచ్ టైం అయింది బావ అని ముద్దుగా మెసేజ్ పెడ్తావ్. నాకు మాత్రం ఉండదా, నీతో కలిసి లంచ్ చేయాలని.
నా పాటికి నేను మొహం కడుక్కొని ఇంట్లోకి వస్తుంటే, గుమ్మం దగ్గర నుల్చోని, తుడవనా అని కొంటెగా కన్నుమీటుతావ్. నాకు మాత్రం ఉండదా, నీతో సరసాలాడాలని.
[ ఈ కార్పొరేట్ జీవితాల్లో, ఆఫీసుకి త్వరగా వెళ్లి లేటుగా వచ్చి, పని ఒత్తిడి లో చిన్న చిన్న ముచ్చట్లు కోల్పోయే వారి కోసం]
Comments
Post a Comment