రాజాధిరాజావప్పా...పిచ్చెట్టా పట్టిందబ్బా...!!



     అనగనగా ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టిన పిచ్చి మహారాజు ఒకడుండేవాడు. ఆయన చేసేవన్నీ మహా పిచ్చి పనులే. ఎందుకు ఎలా అని నన్ను అడగద్దు. నాక్కూడా చెప్పలేదు. నాకే కాదు, ఎవ్వరికి చెప్పలేదు. చెప్పడు కూడా. ఎందుకంటే ఆ పెద్దాయనకి పిచ్చి. చెప్పా కదా, మహా పిచ్చి. పిచ్చి పీక్స్.అస్సలు ఏమన్నా చెప్తేనేకదా, ఎవరికైనా తెలిసేది. ఆయనకి ఎందుకు పిచ్చి పట్టిందో తెల్సిన వాళ్ళందరూ ఇప్పుడు రాజ్యం లో లేరు. ఎప్పుడో బకెట్లు,పాత్రలు, కుండలు, చెంబులు వాళ్ళ ఇంట్లో ఏముంటే అవి తన్నేసి పోయారు. ఈ పిచ్చిమారాజు ఒక్కడే మిగిలాడు. చెప్పా గా, ఎప్పుడో భూమి పుట్టినపుడు పుట్టాడు అని.

     ఈ పిచ్చిమారాజు అస్సలు రాజు ఎట్టా అయ్యాడు అని రాజ్యం లో అందరికి మహా డౌటు గా ఉండేది. కానీ ఎవ్వరికి అడగడానికి జేబులో గుండె ఉండేది కాదు. అడిగితే ఏ పిచ్చి శిక్షో వేస్తాడు అని. వెనుకటికి పిచ్చిపుల్కన్న అనే గొప్పవ్యక్తి ఇట్లానే ముందు వెనుక ఆలోచించకుండా రాజదర్బారు లో దూరి దొరగారి కాలరు దొరకబట్టుకొని ఏందిబే ని పిచ్చి దొరతనం అని దున్నేసాడంటా. దొరగారు మొదట జడుసుకొని, తరవాత తానే రాజు అని గుర్తు తెచ్చుకొని, ఏమంటివి ఏమంటివి.. రాజుగారి నే ఏందిబే అందువా అని ఒర లోని కత్తి ని బయటికి తీసి మహావీరుడు పుల్కన్న జుట్టు పట్టుకోని గర గరా గుండు గొరిగేసాడంట. వాడు ఇంతకాలం ప్రేమతో వాటిక హెయిర్ ఆయిల్ పెట్టుకొని పెంచుకున్న జుట్టుని దర్బారు లో అందరి ముందర రాజు గోరిగేయడంతో, అవమానభారం సహించలేక, వెళ్లి అదే వాటిక హెయిర్ ఆయిల్ వన్ ప్లస్ వన్ ఆఫర్ లో వచ్చిన రెండు బాటిల్స్ తాగేసి, కడుపునొప్పి తట్టుకోలేక బాత్రూముకెళ్లి, అక్కడ పక్కనే ఉన్న బకెట్ ని గురిచూసి ఒంటి కాలితో తన్నేసాడంట. ఆ తరువాత ఎవ్వరు రాజుగారిని కెలికే కార్యక్రమం పెట్టుకోలేదు. అంతేగాక వాటిక హెయిర్ ఆయిల్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఎక్స్పైర్ ఐపోయింది కూడాను.


     ఇదంతా తెలుసుకున్న పిచ్చిపుల్కన్న కొడుకు ఎలాగైనా నాన్నగారి ఆశయం నెరవేర్చాలి అని ఫాస్ట్ ఫార్వార్డ్ లో రేయింబవళ్లు కష్టపడి పొదున్నే కల్లా ఒక టైం మెషీన్ కనుక్కున్నాడు. వెంటనే, మెషీన్ ఎక్కేసి టైం లో వెనక్కు వెళ్ళి, వాళ్ళకి వీళ్ళకి కాళ్ళావేళ్ళ పడి, కష్టపడి, రాజు గారు ఎప్పుడు పిచ్చిమారుజు అయ్యాడో తెలుసుకున్నాడు. ఎలా అయ్యాడో తెల్సుకోడానికి వెంటనే ఆ సమయానికి బండేసుకొని బయల్దేరాడు. అప్పుడు రాజు తన ఏకాంతమందిరం లో యమా సీరియసు గా తన సెల్ఫోను లో ఏదో చేసుకుంటున్నాడు. చంద్రముఖి సినిమా లో ధీమ్..తోమ్..
తోమ్.. డాన్సు చేస్తున్న జ్యోతిక ని బొక్క లోంచి తొంగి చూస్తున్న ప్రభు లా దాక్కొని రాజునే గమనిస్తున్నాడు పుల్కన్న సుపుత్రుడు. రాజుగారి మొహం యమా సీరియసు గా ఉంది. ఏంటబ్బా అంత సీరియస్ అని సెల్ఫోన్ లోకి తొంగి చూస్తే, పాపం రాజుగారు క్యాండిక్రషు ఆడుకుంటున్నారు. తొమ్మిదివందలతొంభైతొమ్మిదో లెవెల్ ముగియకుండా మొరాయిస్తోంది. పిచ్చిరాజు గారు పొట్టి చెడ్డీలు వెస్కొనేటపట్నుంచి, క్యాండీక్రుషు లో వెయ్యి లెవెల్స్ కంప్లీట్ చేయాలని ఓ కల. ఈ తొమ్మిదివందలతొంభైతొమ్మిదో లెవెల్ కదలకపోయేసరికి రాజు గారికి అసహనం కలిగింది. కోపం వచ్చింది. చిరాకు లేచింది. ఇలాంటి ఇంకో పది పిచ్చి భావాలన్నీ కలిసి, కడుపులో మిక్స్ అయ్యి, మెదడు లో ఫిక్స్ అయ్యాయి. ఫోను నేలని తాకి వెయ్యి ముక్కలయ్యింది. మంత్రి దగ్గర అప్పుచేసి కొనుక్కున్న ఫోను, కష్టపడి కంప్లీట్ చేసిన క్యాండీక్రుషు తొమ్మిదివందలతొంభైఎనిమిది లెవెల్స్ చేజారి పోయినందుకు రాజు కృంగి పోయాడు. పిచ్చి గా కిందపడిపోయిన ముక్కల్ని ఏరుకొని వాటితో క్యాండిక్రషు ఆడుకోవడం ప్రారంభించాడు. "పూర్తిగా పిచ్చిమారాజుగా మారిన మా రాజుగారిని చూడు" అని పక్క బొక్కలోంచి చూస్తున్న మంత్రి రజనీకాంత్ స్టైల్ లో చెప్పాడు.

--- శ్రీ ---


Comments

Post a Comment

Popular posts from this blog

ఏ మాయ చేసావే.. !?

(సరదా కి) Guide to youngsters whose parents have smartphones

పొట్టి బుడంకాయ్!