చిన్నప్పటి కబుర్లు - నేను నా బొమ్మలు




        అందరి పిల్లలాగే నాక్కూడా బొమ్మలంటే చాల ఇష్టం. ముఖ్యంగా కూ.. చుక్ చుక్ ..రైలు బొమ్మ, బ్రూ..మ్ బ్రూ.....మ్  కారు బొమ్మ, ట్రింగ్ ట్రింగ్ ఫోన్ బొమ్మ... నాకు బాగా ఇష్టమైన బొమ్మలు. రైలు తీస్కుని.. ఇసుక లో పట్టాలు లేకపోయినా భలేగా నడిపేసేవాడ్ని. కారు బొమ్మలు రెండు ఉండేవి. ఒకటి ఎర్రది ఇంకోటి నల్లది. నల్లది పోలీసు కారు, ఎర్రది దొంగల కారు. ఎడమ చేతి తో దొంగలు కారు పారిపోతుంటే కుడి చేతి తో పోలీసు కారు వెంటాడేది. నా హాలీవుడ్ యాక్షన్ సినిమాల ఇష్టం ఇక్కడ్నుంచే వచ్చిందన్నమాట. ఇంక టెలిఫోన్ ఐతే రింగు నేనే, అటు వైపు నేనే, ఇటు వైపు నేనే. అప్పుడప్పుడు పోలీసులు నాకు ఫోన్ చేసి దొంగల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. కొన్ని సార్లు మా పెద్దమ్మ కి కాల్ చేసి మాట్లాడేవాడిని. ఇంకొన్ని సార్లు సుజి (ఎవరో చెప్పను పొండి :p ) తో మాట్లాడేవాడిని. మిగతా పిల్లలకి ఈ బొమ్మలు అంటే ఎందుకు అంత ఇష్టమో తెలీదు గాని నాకు మాత్రం రెండు కారణాలున్నాయి.

బొమ్మలు నా చాకోలెట్లు, బిస్కెట్లు అడగవ్ - అప్పట్లో చాలా తెలివిగా మా స్కూల్ పక్కనే కిరానా కొట్టు పెట్టారు. పెట్టింది కూడా మా స్కూల్ హెడ్ మాస్టరే. మాస్టరమ్మ ఆంటీ (హెడ్ మాస్టరు గారి పెళ్లామ్) కొట్టు నడిపేది. పేదోళ్లు మాస్టరమ్మ అని పిలిచేవాళ్ళు, మేము ఆంటీ అని పిలిచే వాళ్ళం. అందుకే మాస్టరమ్మ ఆంటీ అయింది. స్కూల్ కి వెళ్ళేటపుడు నాన్న పావలా లేదా అర్ధరూపాయి ఇచ్చేవాడు. చిన్న జ్ఞానోపదేశం, మీకు తెలియకపొతే: 4 పావలాలూ లేదా  2 అర్ధరూపాయలు, ఒక రూపాయి కి సమానం. స్కూలు ఇంటర్బెల్లు (బెల్లు కొట్టేవాళ్ళు కాబట్టి ఇంటర్బెల్లు అంటారేమో అనుకునేవాడిని. ఇంటర్వెల్ ని సరిగా పలకలేక ఇంటర్బెల్లు అయిందని  హైస్కూల్ కి వచ్చాక తెలిసింది.) కొట్టగానే వెళ్లి ఎదో ఒకటి కొనుక్కునే వాడ్ని (అప్పట్లో పావలా కి చాలానే వచ్చేవి). నేను ఇలా కొన్నానో లేదో చీమిడి ముక్కు గణేషు గాడు నా పక్కన ఉండే వాడు. "నాకు కొంచెం ఇవ్వరా... నీతో రోజు నేనే కదా ఇసుక లో ఆదుకోడానికి వచ్చేది" అని బెదిరించే వాడు. ఇది ఎందుకు బెదిరింపు అంటే, ఇవ్వకపోతే నేను నీతో ఆడుకోను అని వాడి అర్థం. ఇవ్వక తప్పేది కాదు :(   . అందుకే నాకు బొమ్మలంటే ఇష్టం.

బొమ్మలతో ఎపుడైనా ఆడుకోవచ్చు - మా గ్యాంగ్ లో కార్తీకు గాడు మాంచి సౌండ్ పార్టీ. వాడికి సొంత సైకిలు కూడా ఉంది (ఈ సైకిలుకి ఓ స్టోరీ కూడా ఉంది. ఇంకో పోస్ట్ లో చెప్తాలెండి). వాడు ఆడుకోడానికి పిలిస్తే మా గ్యాంగ్ మొత్తం ఎగేసుకుపోయేది. నేను పిలిస్తే శివగాడు, చిన్న, గణేషు (లంచం తీసుకున్నాక) వచ్చేవాళ్లు. మేము అంత స్కూలు గ్రౌండ్ లో చిళ్లాకట్టి ఆడుకుంటూ ఉంటామా, కార్తీకు గాడు సైకిలు వెస్కొని ట్రింగు ట్రింగు మని బెల్లు కొడతాడు. శివ గాడు చెడ్డి ఎగేసుకొని పరిగెత్తి పోతాడు. సాయంత్రం ఆరవగానే,చిన్న వాళ్ళ నాన్న వస్తాడు. వాళ్ళ నాన్న అంటే వాడికి ఒకటి రెండు పడిపోతాయి. ఆరు తర్వాత వాడికి ఇంట్లో నే ట్యూషన్ ట. గణేషు గాడికి ఏది ఆడడం సరిగా రాదు. కానీ ఎం చేస్తాం, కనీసం వాడైనా ఉన్నాడు. వాడికి ఎర్రకారు.. నాకు నల్ల కారు. బ్రూమ్..బ్రూ....మ్.

అప్పట్లో బొమ్మలు కూడా నిజమైన వస్తువులే అనుకునే వాడ్ని(అవును, బొమ్మలు కూడా వస్తువులే కదా అనకండి). అంటే, నా దగ్గర ఉన్న కారు బొమ్మ ఒకప్పుడు నిజమైం కారే అన్న మాట. ఫోను బొమ్మ ఒకప్పుడు నిజమైన ఫోను అన్నమాట. వాటికీ వయసైపోయి ఆలా చిన్నగా అయిపోతే, మనం బొమ్మలుగా తెచుకున్నామన్నమాట. మూడో క్లాసు లో ఉన్నపుడు మా ట్రాక్టరు ట్రాలీ ఎక్కడానికి నాకు అస్సలు అందేది కాదు, నాల్గో క్లాసు కి వచ్చాక సుబ్బరం గా అందేది. అంటే ట్రాలీ చిన్నగా అయినట్టే గా. ఎప్పుడో ఒకప్పుడు ఈ ట్రాక్టరు బొమ్మ నాదే అనుకొనేవాడ్ని. మనం (మనుషులం) మాత్రం కొంత కాలం పెద్దవాళ్ళం అయి, పెళ్లి చేసుకొని, మమ్మీ డాడీ అయ్యాక, చివరకు మల్లి చిన్నగా అయిపోయి బొమ్మలు అయిపోతామన్నమాట. నా థియరీ వెయ్యిశాతం తప్పని మా జేజి బకెట్ తన్నేశాక తెలిసింది. ఎందుకో అప్పట్నుంచి బొమ్మలు అంటే ఆసక్తి తగ్గిపోయింది. నా బొమ్మలు అన్ని నా తమ్ముడికి రాసిచ్చేశాను, అప్పుడప్పుడు పోలీసు దొంగ కార్లు నేను కూడా ఆడుకోవచ్చు అన్న ఒప్పందం తో. 


--- శ్రీ ---

Comments

Popular posts from this blog

ఏ మాయ చేసావే.. !?

సీతాకోకచిలుక

(సరదా కి) Guide to youngsters whose parents have smartphones