ఆదివారం అమావాస్య అర్థరాత్రి




ఆదివారం అమావాస్య అర్థరాత్రి(నిన్ననే!)...

ఆదివారం అమావాస్య అర్థరాత్రి సమయంలో ఏవేవో జరుగుతాయని చిన్నపుడు మా నానమ్మ చెప్తే నేను నమ్మేవాణ్ణి కాదు. కానీ నిన్న రాత్రి జరిగింది తల్చుకుంటే నిజమేమోననిపిస్తుంది.
రాత్రి నేను టెర్రస్ మీద పడుకొని ఉన్నాను. సడెన్ గా అర్థరాత్రి మెళకువ వచ్చింది. నా మీద ఉన్న దుప్పటి ఎవరో లాగుతున్నట్టనిపిచింది. దాంతో నాకు టెన్షన్ వేసింది. తర్వాత దాహమేసింది(అంటే గొంతెండిపోయింది).మొత్తానికి చాలా భయమేసింది. ఎంతంటే ఆ భయంతో కళ్లు కూడా తెరవలేకపోయాను.కానీ నోరు తెరిచి చూళ్లేం కదా! అందుకే కళ్లే తెరిచాను.నా కాళ్ల దగ్గర ఏదో ఆకారం అస్పష్టంగా కదులుతున్నట్టుగా అనిపించింది.నా గుండెలు ఝల్లుమన్నాయి(క్షమించాలి నాకున్నది ఒక గుండే ఐనా అందరూ వాడతారని బహువచనం వాడాను). అక్కడున్నదేదో చూద్దామంటే చుట్టూ మన ప్రభుత్వం దయ(కరెంటు కోత) వల్ల వచ్చిన కారుఛీకటి అప్పుడే వేసిన తారురోడ్డులా ఉంది(ఛ! సమయానికి సరైన ఉపమానాలు కూడా గుర్తొచ్చి చావవు). పైగా అమావాస్యట నిన్న, నెలకోసారే కదా అని చంద్రుడు కూడా రెస్ట్ తీస్కోవడానికి వెళ్లాడు. కళ్లకు గంతలు కట్టుకున్నట్టుగా ఉంది.
పోనీ నీ సంగతేంటని దాన్నే అడుగుదామంటే దానికి మాట్లాడటం వచ్చో రాదో, వచ్చినా తెలుగు వచ్చో రాదో అని ఊరుకున్నా. ఇంతలో అది ఒక అడుగు ముందుకేసింది. నా గొంతు మళ్లీ ఎండిపోయింది. నీళ్లకోసమని పక్కనే ఉన్న బాటిల్ తీశాను. కానీ అందులో నీళ్లు లేవు.కొంపదీసి ఇదిగానీ తాగేసుంటుందా? అయినా అయ్యుండచ్చు, ఎండాకాలం కదా! తాగేసినా ఈ దిక్కుమాలింది ఇంకా ఇక్కడేం చేస్తున్నట్టు. అప్పుడే ఎక్కడ్నుంచో నక్క ఈళ వినిపించింది. నాకు అదేదో సినిమాలో వెంకటేష్ చెప్పిన దెయ్యం కథ గుర్తొచ్చి నా గుండెల్లో రైళ్లు,విమానాలతో పాటు ఇంకా ఏవేవో పరిగెట్టాయి. నా బాధ అర్థం చేస్కుందో ఏమో గానీ ఆ ఆకారం కొంచెం దూరంగా వెళ్లింది.అప్పుడర్థమైంది దానికి నాలుగు కాళ్లున్నాయి,ఒక వంకర తిరిగిన తోక కూడా ఉందని. తర్వాత అదొక చిరపరిచితమైన శబ్దం చేసింది. అప్పుడుగానీ తట్టలేదు అది మా వీధిలో తిరిగే శునకరాజం అనీ,దానిక్కూడా మాలాగే టెర్రస్ మీద పడుకునే అలవాటు ఉందని. ఇంతసేపూ దీన్ని చూసా నేను భయపడింది అని నాలో నేను నవ్వుకున్నాను. తర్వాత దుప్పటి కప్పుకొని నిద్రపోయాను
ఏంటో ఆదివారం అమావాస్య అర్థరాత్రి ఏదో హర్రర్ సినిమాలా ఉంటుందనుకుంటే చివరికి ఇలా కామెడీ సినిమా అయింది. :)
(................ఇదంతా కేవలం కల్పితం మాత్రమే...............)
  

 -బాలు

Comments

Post a Comment

Popular posts from this blog

ఏ మాయ చేసావే.. !?

పొట్టి బుడంకాయ్!

(సరదా కి) Guide to youngsters whose parents have smartphones